Kanna Lakshmi Narayana: బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కుంభకోణాలతో జగన్ దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారని తిరుపతిలో నిర్వహించిన ‘బీజేపీ ప్రజాపోరు వీధి సభ’లో కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. ఆయన అస్తవ్యస్త పాలనతో జనం విసిగిపోయారని ఆరోపించారు. వైసీపీ అసమర్థపరులపై తాము పోరాటం చేస్తామని.. బీజేపీ కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ 130 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని.. కేవలం 9 సంక్షేమ పథకాల పేర్లు పెట్టి.. అర్హులైన వారికి సీఎం జగన్ ఇవ్వడం లేదని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేయకుండా.. అమరావతిని అభివృద్ధి చేయాలని హితవు పలికారు. మూడు రాజధానుల పేరుతో విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు దోచేశారన్నారు. ఏపీలో పాలన జరగటం లేదని.. జగన్ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్ దోపిడీ వ్యాపారం మాత్రమే జరుగుతోందని విమర్శలు చేశారు.
Read Also:Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో శశిథరూర్.. ఓకే చెప్పిన సోనియా!
మరోవైపు గుంటూరులో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని మార్చడం ఎవరితరం కాదన్నారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. వైసీపీ దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామని.. అధికార బలంతో వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. సీపీఎస్ రద్దు, పీఆర్సీ విషయంలో ఉద్యోగులతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.