Twist in Missing Case: చిత్తూరు జిల్లా తెలుగు గంగ కాలువలో యువతి మృతదేహం లభ్యం ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయిందని భావించిన యువతి వీడియోలో ప్రత్యక్షమైంది. హత్య చేశాడని అనుమానించిన యువకుడితోనే వీడియోలో యువతి కనిపించింది. శ్రీకాళహస్తిలోని రామాపురం గ్రామానికి చెందిన చంద్రిత అనే యువతి ఈ ఏడాది జనవరి నుంచి మిస్సింగ్ అయ్యింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ చంద్రశేఖర్‌తో యువతి చంద్రిత ప్రేమాయణం నడిపింది. తమ కుమార్తె చంద్రితను ప్రేమ పేరిట మోసం చేసిన వాలంటీర్ చంద్రశేఖర్ చంపేశాడని తల్లిదండ్రులు కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం తెలుగు గంగ కాలవలో గుర్తుపట్టలేని స్థితిలో యువతి మృతదేహం లభ్యం కాగా అందరూ ఆ శవం చంద్రితదే అని భావించారు.
మరోవైపు ఏర్పేడు వద్ద చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది. తెలుగు గంగ కాలువలో లభించినది చంద్రిత మృతదేహం అని భావించి దోషులను పట్టుకోవాలని మూడు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏర్పేడు చెరువులో లభించినది తమ కుమారుడు చంద్రశేఖర్ అని భావించి, తమ వాడిని కొట్టి చంపేశారని కుటుంబీకులు ఆందోళనకు దిగారు.
Read Also: దేశంలోని 10 అందమైన్ బీచ్‌లు.. తప్పకుండా సందర్శించాల్సిందే!
అయితే మొత్తం వ్యవహారంలో ఆదివారం బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రశేఖర్, చంద్రిత కలిసి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాము ఇద్దరం ఒక చోట సంతోషంగా ఉన్నామని, అనవసరంగా తమ గురించి గొడవలు పడవద్దు అంటూ వీడియోలో పేర్కొన్నారు. తనను హంతుకుడిగా చిత్రీకరించారని టీడీపీ, జనసేన నేతలపై చంద్రశేఖర్ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రేమించానన్న కారణంగా తల్లిదండ్రులు తనను హింసించారని చంద్రిత వీడియోలో చెప్పింది. వీళ్లిద్దరి సెల్ఫీ వీడియో విడుదల కావడంతో శ్రీకాళహస్తి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వీళ్లు ఎక్కడ ఉన్నారన్న వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.