అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడిలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్ని పోలీసులు ఆపారు. అయితే తాను ఎంపీ నందిగం సురేష్ బంధువును అని.. తన వాహనాన్నే ఆపుతారా అంటూ సుధీర్ అనే వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఎంపీ సురేష్‌కు అతడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను తన ఇంటికి వచ్చి కలవాలని ఎంపీ సురేష్ ఆదేశాలు ఆరీ చేశారు.
అయితే ఈ విషయాన్ని ఎస్సై, కానిస్టేబుల్ సీఐ దృష్టికి తీసుకువెళ్లారు. సీఐ సూచనతో పోలీసులు ఎంపీ నందిగం సురేష్ ఇంటికి బయలుదేరారు. ఇంతలో కానిస్టేబుల్ ఫోన్‌లో తనకు కనీస మర్యాద ఇవ్వలేదని ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో తుళ్లూరు డీఎస్పీ పోతురాజు ఎస్సై, కానిస్టేబుళ్లను ఎంపీ ఇంటికి వెళ్లవద్దని వెనక్కి పిలిపించారు. ఎంపీతో తానే మాట్లాడి ఈ వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పారు. అయితే తాను కానిస్టేబుల్‌పై అరవలేదని.. తన మనిషిపైనే అరిచానని.. బైక్‌పై వెళ్తూ హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించానని ఎంపీ సురేష్ వివరణ ఇచ్చారు.