తీరం వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా విశాఖలో భారీ వర్షం పడుతోంది… అయితే, ‘అసని’ తుఫాన్ దిశ మార్చుకున్నట్టు వాతావరణశాఖ చెబుతోంది.. రేపు సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని.. మచిలీపట్నం దగ్గర తుఫాన్ తీరం దాటే సూచనలు ఉన్నాయని… దీని ప్రభావంతో.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇక, దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
Read Also: AP Government: పరిశ్రమలకు గుడ్‌న్యూస్.. పవర్ హాలిడే ఎత్తివేత..
బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్రతుఫాన్ కొనసాగుతోంది.. గడిచిన 6 గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుందని.. ప్రస్తుతం కాకినాడకు 210 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 310 కిలోమీటర్లు, గోపాలపూర్ కు 530 కిలోమీటర్లు, పూరీకి 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయంకు కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని.. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.. తదుపరి 12గంటల్లో క్రమంగా తీవ్రతుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడే అవకాశం ఉంది.
ఇక, ఈ రోజురాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని.. సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తుఫాన్ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లా యాత్రాంగాలని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ.. సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.