సాధారణంగా విద్యార్థులు బస్ పాస్ పొందడమే కాదు.. దాని రెన్యూవల్ కు కూడా ఎంతో శ్రమించాల్సి వస్తుంది.. రెన్యూవల్ డేట్ వచ్చిందంటే చాలు.. విద్యార్థులు, విద్యార్థినులకు కష్టాలు తప్పడం లేదు.. గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి.. ఇక, కొన్ని సార్లు క్లాసులకు డుమ్మా కొట్టి బస్ పాస్ రెన్యూవల్ కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ, త్వరలోనే విద్యార్థుల బస్ పాస్ రెన్యూవల్ కష్టాలు తొలగిపోనున్నాయి…
ప్రతి నెలా ఆన్‌లైన్‌లోనే విద్యార్థుల బస్ పాస్‌లు రెన్యూవల్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనుంది ఏపీఎస్ ఆర్టీసీ.. ఇవాళ విజయవాడ బస్టాండ్‌లోని బస్ పాస్ కౌంటర్ వద్ద వేచి ఉన్న విద్యార్థినులతో ముచ్చటించారు మంత్రి పేర్నినాని.. బస్టాండులో ఎందుకున్నారని విద్యార్థినులను మంత్రి అడగడంతో.. బస్ పాస్ రెన్యూవల్ కోసం వచ్చామని.. దానికోసమే వెయిట్ చేస్తున్నామని విద్యార్థులకు మంత్రికి వివరించారు.. దీంతో.. ఆన్‌లైన్‌లోనే బస్ పాస్ రెన్యూవల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు మంత్రి పేర్నినాని.. ఒకటి రెండు నెలల్లో ఆన్‌లైన్ విధానంలోనే బస్ పాస్ రెన్యూవల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.