ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరోనా నియంత్రణ మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాకుండా పాఠశాలల్లో ఎలాంటి క్రీడలు నిర్వహించవద్దని సూచించింది. విద్యార్థులు గూమిగూడకుండా టీచర్లు చర్యలు తీసుకోవాలని హితవు పలికింది.
Read Also: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. లిస్ట్ ఇదే
కరోనా నేపథ్యంలో పాఠశాల ఆవరణలను ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రం చేస్తుండాలని విద్యాశాఖ తన మార్గదర్శకాల్లో సూచనలు చేసింది. కరోనా నియంత్రణకు జిల్లా విద్యాధికారులు సంబంధిత డీఎంహెచ్‌వోలను కలిసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడితే వెంటనే చికిత్స అందించాలని తెలిపింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి మార్గదర్శకాలు పాటించాలని వెల్లడించింది.