రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 7337359375 కు “HI” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. 2025–26 ఖరీఫ్ పంట సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొనడానికి 10,700 మంది సిబ్బందిని సిద్ధం చేశామని చెప్పారు.
“రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ అవుతుంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే నాణ్యమైన గోతాలు సిద్ధం చేసుకోవాలి. తేమ శాతం నిర్ధారించే యంత్రాలు, రవాణా సదుపాయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి,” అని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలు జారీ చేశారు. రైతుల సౌలభ్యం కోసం సమగ్ర ఏర్పాట్లు చేయాలని, అన్ని జిల్లాల్లో సేకరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని ఆయన ఆదేశించారు. ఈ నెల నవంబర్ 3న తాడేపల్లిగూడెం మండలంలోని ఆరుగొలను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి స్వయంగా ప్రారంభించనున్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడడం, ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..