జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని కామెంట్ చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును గౌరవిస్తాం.. అదే, సమయంలో ప్రజా న్యాయస్థానం తీర్పు మాకు ముఖ్యం అన్నారు.. సాంకేతికమైన సమస్యలను అధిగమించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన అవంతి.. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు మాకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని.. జనం ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత మామీద ఉందన్నారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే అభ్యంతరాలు ఎందుకో అర్ధం కావడం లేదని దుయ్యబట్టిన ఆయన.. భవిష్యత్తులో ప్రాంతీయ వేర్పాటు తత్వం వస్తే మళ్లీ నష్టపోకూడదనే ఉద్దేశంతోనే వికేంద్రీకరణకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Read Also: Paytm: పేటీఎం సీఈవో అరెస్ట్.. విషయం ఇదే..!
ఇక, మూడు రాజధానులపై బీజేపీది రెండు నాల్కల ధోరణి అంటూ మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్.. బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరిపై మాకు గౌరవం ఉంది… కానీ, మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం అప్పులు చేయకుండానే ప్రభుత్వాన్ని నడుపుతుందా…? అని ప్రశ్నించిన ఆయన.. బీజేపీ రాష్ట్రాలతో సమానంగా బీజేపీయేతర రాష్ట్రాలను గౌరవించాలని సూచించారు.. ఇదే సమయంలో.. పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కామెంట్ చేశారు. స్టీల్ ప్లాంట్ గురించి చిత్త శుద్ధితో పోరాడుతున్నాం… అఖిలపక్షాన్ని కేంద్రం దగ్గరకు తీసుకుని వెళ్తామన్న పవన్.. ఎందుకు ఆ పని చేయలేదు? అని నిలదీశారు. మరోవైపు.. కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా మూడు రాజధానులు గురించి ఆలోచిస్తున్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయన్న మంత్రి అవంతి.. విశాఖ అర్బన్ ప్రాంతంలో జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌కు కోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోయాయని.. 8 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.