ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది.. మొత్తంగా ఈ ఏడాదిలో పీఆర్సీ ప్రకటన అనేది వట్టి మాటే అని తేలిపోయింది అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ మళ్లీ తిరోగమనం వైపు మళ్లిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మళ్లీ ఉద్యమంలోకి వెళ్తాం అంటున్నారు.. పీఆర్సీపై కసరత్తులో భాగంగా.. ఇవాళ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ఆర్ధిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతోనూ చర్చలు జరుగుతున్నాయి.. అయితే, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: తాగి వాహనాలు నడిపితే పబ్‌లదే బాధ్యత..!
ఇవాళ జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో పీఆర్సీపై ఎలాంటి పురోగతి లేదన్నారు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సీఎంకు వివరించామని అధికారులు చెప్పారు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మాకు వివరించారని.. ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్స్ చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ బిల్స్ అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్న ఆయన.. ఉద్యోగ సంఘ నాయకులుగా మాపై బాగా ఒత్తిడి ఉందన్నారు.. ఇక, 71 డిమాండ్స్ పై కూడా ఎలాంటి చర్యలు లేవన్నారు బండి శ్రీనివాసరావు.. అధికారుల నివేదికను మేం పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసిన ఆయన.. ప్రతి ఐదేళ్లకు పీఆర్సీ ఇవ్వడం సంప్రదాయం.. కొత్త సంవత్సరం కానుకగా పీఆర్సీ ఇస్తారని అనుకున్నాం.. కానీ, మా ఆశలు అడియాసలుగా మారిపోయాయని.. వచ్చే నెల 3న జరిగే సమావేశంలో మా కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఇక, ఉద్యోగులకు గౌరవప్రదంగా వచ్చే సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోందని మండిపడ్డారు ఏపీ అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, మళ్లీ పీఆర్సీ తిరోగమనం వైపు మళ్లిందన్న ఆయన.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మాకు అధికారులు వివరిస్తున్నారు.. కానీ, 2013 నుంచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బానే ఉందని.. అధికారులు చెప్పే లెక్కలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. ఆర్థిక పరిస్థితి బాలేకపోతే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించిన బొప్పరాజు.. ఉద్యోగులు దాచుకున్న రూ.1600 కోట్లు వడ్డీతో కలిపి రూ.2100 కోట్లు అయ్యిందన్నారు. ఇక, చర్చలకు ఎందుకు పిలిచారు అని అడిగితే ఫిట్‌మెంట్ కోసం అన్నారు.. మళ్లీ 14.29 శాతం పైనే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈసారి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా పురోగతి ఉంటేనే చర్చలకు పిలవాలని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే మేం సీఎం దగ్గరే మాట్లాడుకుంటాం అన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.