ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా చెరువులు, కుంటలు నిండి కట్టలు తెగిపోతున్నాయి. దీంతో వరద నీరు గ్రామాల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొన్న చోట్ల చెరువులు నిండుకుండాలను తలపిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని ప్రజలు బిక్కబిక్కుమంటూ భయాందోళనలో ఉన్నారు.
అనంతరపురం కురిసిన భారీ వర్షాలకు హిందుపురంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హిందుపురం నుంచి అనంతపురం, పెనుకొండ, గోరంట్ల, లేపాక్షి, చిలమత్తారు గ్రామాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారిమళ్లించారు. రేణిగుంట-కడప, గూడురు-విజయవాడ మధ్య నడిచే 7 రైళ్లను చేయగా, 4 రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించింది.
కడపలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పాత మూడంస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనంలోని రెండో అంతస్తులో తల్లీకూతురు ఉండడంతో బయటకు రాలేక ఇరుక్కుపోయారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కిటికీని కట్ చేసి క్షేమంగా తల్లీకూతుళ్లను బయటకు తీసుకువచ్చారు.