ఏపీలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న పాఠశాలలు రీఓపెన్ కావాల్సి ఉంది. ఈ మేరకు గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా అంటే జూలై 5న పున:ప్రారంభం కానున్నాయి. జూలై 4న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మంగళగిరి పరిధిలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్ల రీ ఓపెన్‌ను వాయిదా వేసి జూలై 5న పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా వచ్చే నెల 4న ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు ఆయన విశాఖ, భీమవరం, గుంటూరు జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లోనూ పాల్గొంటారు. అంతేకాకుండా మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రారంభోత్సవంలోనూ ప్రధాని మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో మోదీ పర్యటనతో తమకు లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది.