Andhra Pradesh: మాండూస్ తుఫాన్ ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా 32 మండలాలలో తుఫాన్ ప్రభావం ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. 33 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 778 మందికి పునరావాసం కల్పించారు. ఈ నేపథ్యంలో మాండూస్ తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు ఈ ఆర్థిక సాయం అందుకోనున్నారు.
Read Also: Mobile Explode: గేమ్స్ ఆడుతుండగా పేలిన సెల్ ఫోన్
మాండూస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థికసాయం అందించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం జరగుకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందని.. అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి విపత్తుల సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాన్ కదలికలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని తెలిపారు. తుఫాన్ సహాయక చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరుకు-2 మొత్తంగా 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.
అటు మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీ భారీగా పంటలు దెబ్బతిన్నాయి. గన్నవరం, అవనిగడ్డలో భారీగా పంట నష్టం ఏర్పడింది. సుమారు 10 నుంచి 12 వేల ఎకరాల్లో రైతులు వరి పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. గోనె సంచుల కొరత కారణంగా రోడ్డుపైనే తడిసిన వరి ధాన్యం ఉండిపోయింది. అవనిగడ్డలో వరి పంటతో పాటు టమోట, క్యాబేజీ, మిర్చి పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.