Pawan Kalyan: ప్రకృతిని పరమేశ్వరి ప్రతిరూపంగా ఆరాధించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి ప్రకృతిలో ఆకృతి తొడిగే పుష్పాలను బతుకమ్మలుగా పూజించడం తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయం.. దేవి నవరాత్రులతో ఆరంభమయ్యే బతుకమ్మల పూజలు, ఆటలు నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్న తరుణంలో నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పేర్కొన్నారు. పులగం, దద్దోజనం, పులిహోర, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది ఇలా అనేక రకాలైన సద్దులను చేసి బతుకమ్మకు నైవేథ్యంగా మన ఆడపడుచులు సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందచేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఈ నైవేథ్యాల తయారీలో ఎన్నో మేలైన ఆహార దినుసులు మేళవించడం వల్ల అవి ఆరోగ్య ప్రదాయినులుగా భక్తులకు మేలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: PM Modi: లావోస్ చేరుకున్న ప్రధాని మోడీ.. 2 రోజుల పర్యటన
అలాగే, అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి జంతువును ఒక్కో దేవత ప్రతిరూపంగా మన అడవి బిడ్డలు పూజించడం మనం చూస్తుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రకృతిని వారు అంత పవిత్రంగా భావించడం వల్లే అడవులు ఇంకా కొంత వరకైనా పచ్చగా ఉంటున్నాయని భావించడం అతిశయోక్తి కాదు.. అదే తీరున నగరాలు, పట్టణాలలో ఉండే ఆడపడుచులు ఏడాదికి ఒకసారి ఇలా ప్రకృతిని పూజించడం ఒక గొప్ప సాంప్రదాయ పరంపరగా నేను భావిస్తాను అని ఆయన కోరారు. సద్దుల బతుకమ్మ తరలి వెళ్తున్న తరుణాన ఆడపడుచులందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా శక్తి స్వరూపిణిని కోరుకుంటున్నాను అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.