ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు. రాయదుర్గంలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ ల్యాబ్ ప్రారంభోత్సవం. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడే పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు సీఎం జగన్.
ఇక, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పులివెందుల చేరుకుంటారు. నాలుగు గంటలకు ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. రాత్రికి అక్కడే విడిది చేస్తారు సీఎం జగన్. రెండో రోజు అంటే 9వ తేదీన 11 గంటల ప్రాంతంలో కడప జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. జగన్ సీఎం అయిన తర్వాత బద్వేలుకు మొదటిసారి వెళ్తున్నారు. బద్వేలు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి కడప నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం జగన్. కడపలోని సీపీబ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత వైఎస్ రాజారెడ్డి స్టేడియానికి చేరుకుని విగ్రహాలు, ఫ్లడ్‌లైట్లను ఆవిష్కరిస్తారు. అనంతరం రెండు రోజుల పర్యటన ముగించుకుని సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా మంత్రులు, ఇంఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.