వైసీపీ ప్లీనరీలో టీడీపీ అధినేత చంద్రబాబు వేలి ఉంగరంలో చిప్ ఉండటంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి బాగోగుల గురించి ఆలోచించే చిప్ మెదడు, గుండెలో ఉండాలి కానీ.. చంద్రబాబు చేతి రింగులోనో, మోకాలిలోనో, అరికాలిలోనో ఉంటే లాభం ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. గుండె, మెదడులోనూ చిప్ ఉంటే.. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని జగన్ ఎద్దేవా చేశారు.
Read Also: CM Jagan: ఆనాడు నన్ను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయింది
తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామని జగన్ అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు స్థానిక పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ఉపయోగడుతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడికి లేదా ఆయన పార్టీకి ఏ రోజునా ఇలాంటి ఆలోచన వచ్చిందా అని జగన్ నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ఒక పెత్తందారుల పార్టీ అని జగన్ ఆరోపించారు. ఆ పార్టీ భావజాలంలో ఏ కోశాన కూడా మానవత్వం, పేదల పట్ల మమకారం కనిపించవని విమర్శించారు. చంద్రబాబు పార్టీ సిద్ధాంతం వెన్నుపోట్లేనని.. అప్పట్లో ఎన్టీఆర్‌కు, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. పేదలు, మధ్యతరగతి వారికి మేలు చేయవద్దని టీడీపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం నడుస్తోందన్నారు.