ఏపీ బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోందని ఆయన కామెంట్ చేశారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. అప్పులు ఎగ్గొట్టడానికా అంటూ ప్రశ్నించారు. బడ్జెట్లో ఏ ప్రాంతం అభివృద్ధి గురించి ప్రస్తావనే లేదని ఆరోపించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది అని విమర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో రెవెన్యూ లోటు 5వేల కోట్లకు చేరడం గమనించాల్సిన విషయమని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన అప్పులతోనే సాగుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు ఎన్నిసార్లు అడుగుతున్నా స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా అప్పుల వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావన ఏదని అడిగిన జగన్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రాంతాల వారీగా ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో అందరికీ నిధులిచ్చామని.. కేంద్రంలో 64వేల కోట్లతో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టామని సోము వీర్రాజు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగురవేస్తామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.