పేదల ఆదాయాన్ని పెంచడమే తన అభిమతం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లె గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
ఇది కూడా చదవండి: AIC recruitment 2025: అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ జాబ్స్.. నెలకు రూ.60 వేల జీతం
‘‘నేను ఆ రోజు అందరినీ ఐటీ చదువుకోమన్నాను. అమెరికాలో ఉండే వారి తలసరి ఆదాయం కంటే మన వారి తలసరి ఆదాయం రెండింతలు ఎక్కువగా ఉంది. నన్ను అరెస్టు చేశారు. నేను ఎక్కడ భయపడను. భయం అనేది నా జీవితంలో లేదు. 53 రోజులు నన్ను జైల్లో పెట్టారు. నా కోసం ఐటీ ఉద్యోగులు 80 దేశాల్లో నిరసన చేశారు. ప్రతి దేశంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తే అక్కడ మన తెలుగు వారు ఉంటారు. సంబేపల్లి మీదుగా కాలువ నిర్మాణం చేపట్టి చిత్తూరుకు తీసుకెళ్తాం. హంద్రీనీవా కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తాం. రాయలసీమ ఈరోజు ఇలా ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీఆర్. ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచన చేశారు. ఎవరు మన కోసం మంచి చేశారు అని ఆలోచిస్తే మరో పార్టీకి ఓటు వేయరు.’’ అని చంద్రబాబు అన్నారు.
‘‘రూ.64 వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించాను. ప్రాజెక్టులపై తప్పు చేశారని ప్రశ్నించడానికి వస్తే నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.1000 కోట్లు ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వం రూ.400 కోట్లు డయాఫ్రం వాల్‌కు ఖర్చు పెట్టకుండా వృధా చేసింది. కష్టంలో ఉన్న ఈ రాష్ట్రానికి కేంద్రం సంజీవినిగా మారింది. 2027కు పోలవరం పూర్తిచేస్తాం. రూ.12 వేల కోట్లతో పనులు ప్రారంభించాం. అమరావతిలో నన్ను నమ్మి రైతులు 55 వేల ఎకరాలు ఇచ్చారు. నా ముందు చూపుకు హైదరాబాద్ నగరమే నిదర్శనం. సైబరాబాద్‌కు నామకరణం చేసింది నేనే. హైటెక్ సిటీకి నామకరణం చేసింది నేనే. అమరావతి పేరు వింటే దేవతల రాజధాని గుర్తొస్తుంది. కులం, మతం, ప్రాంతం లేదు. దానిని స్మశానం అని, ఎడారి అని మూడు ముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. వికలాంగులకు మూడు వేల నుంచి 6000 పెన్షన్ పెంచాను.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఇది ప్రజల బడ్జెట్.. పొదుపు, పెట్టుబడుల్ని పెంచుతుంది..
ఇదిలా ఉంటే 6 మంది నిరుద్యోగులకు ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ 6 మంది ఇళ్లకు సోలార్ యూనిట్లు కూడా అమరుస్తామన్నారు. కరెంట్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని.. ఇంటిపై సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం వల్ల ఆటో ఫ్రీగా రన్ అవుతుందన్నారు. ఇంట్లో వాడుకునే విద్యుత్తు కూడా ఫ్రీగా వస్తుందని చెప్పారు.