ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షల షెడ్యూల్‌ను నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని సమాచారం. అలాగే ప్రీఫైనల్ పరీక్షలను ఈనెల 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Also: పీఆర్సీ రగడ.. సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ
కాగా గత ఏడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను జగన్ ప్రభుత్వం పాస్ చేసింది. అయితే ఈ ఏడాది కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు పెట్టడం అవసరమని మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. పరీక్షలను కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని పేర్కొన్నారు.