కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో వివిధ ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కర్నూల్ జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కోసం ఏపీ ఖర్చు పెట్టిన రూ. 176 కోట్ల నిధులను రీ-ఇంబర్స్ చేయాలని కోరిన ఏపీ.. ఉడాన్ పథకంలో భాగంగా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుని తిరిగివ్వాలని ప్రతిపాదనలు చేసింది.. ఇక, భోగాపురం ఎయిర్ పోర్టు వినియోగంలోకి వచ్చాక.. విశాఖ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని కేంద్రాన్ని కోరిన ఏపీ సర్కార్.. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయ్యాక విశాఖ ఎయిర్ పోర్టుకు సాధారణ ప్రయాణికుల రాకపోకలను నిషేధించాలని గతంలో చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసింది.
Read Also: 5 నెలల గరిష్ఠాన్ని తాకిన ద్రవ్యోల్బణం.. కారణాలు ఇవేనా…?
ఇక, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వయబులిటీ గ్యాప్ ఫండింగ్-వీజీఎఫ్ ను కేంద్రమే గ్రాంటు రూపంలో కేటాయించాలని కేంద్రాన్ని కోరింది ఏపీ.. వీజీఎఫ్ కింద సుమారు రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్ధిక మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఏపీ ప్రభుత్వం.. వీజీఎఫ్ కోసం రూ. 20 వేల కోట్లతో ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలని సలహా ఇచ్చింది.. ఏపీలో కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామమాత్రపు ధరకే కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు జరపలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.. పనుల్లో పురోగతి చూపని కేంద్ర సంస్థల నుంచి భూమిని తిరిగి తీసుకునే అవకాశం కల్పించాలని కోరింది. కడప స్టీల్ ప్లాంటుకు 20 ఏళ్ల పాటు సీజీఎస్టీ, ఆదాయపు పన్ను, ఇంపోర్ట్ డ్యూటీని రీ-ఇంబర్స్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం.. ఈశాన్య రాష్ట్రాల తరహాలోనే ఏపీ పరిశ్రమలకు టాక్స్ ఇన్సెంటీవ్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టింది.