ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈనెల 17 వరకే బదిలీలు ఉంటాయని ప్రకటించగా.. కొన్నిశాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. దీంతో ఉద్యోగ సంఘాలు, కలెక్టర్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈనెల 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పెంచుతూ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకుముందు ఉద్యోగుల బదిలీకి జగన్ ప్రభుత్వం ఆమోదం పలకగా.. బదిలీలకు సంబంధించి నిషేధం ఎత్తివేస్తూ జీవో నంబర్ 116 విడుదల చేశారు. అందులో ఈనెల 17తో ఉద్యోగుల బదిలీల గడువును ముగుస్తుందని పేర్కొన్నారు. బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. బదిలీలకు సంబంధించి అధికారుల నుంచి కీలక విషయాలను రాబట్టి.. ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలకు లైన్ క్లియర్ కావడం, మరోసారి బదిలీలకు సంబంధించి గడువు పెంచడంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.