Dwakra Products Sales in Amazon: ఏపీలోని డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా అమెజాన్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు అమెజాన్, సెర్ప్ ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరింది. అమెజాన్‌లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. వారికి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు దాదాపు 6 వేల రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. అయితే వీటిని ఇప్పటివరకు డ్వాక్రా బజార్లలోనే విక్రయిస్తున్నారు. తాజాగా అమెజాన్‌తో ఒప్పందం వల్ల ఉత్పత్తులకు ప్రాచుర్యం లభిస్తుందని.. అలాగే ఆదాయం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Raj Bhavan: ‘ఎట్ హోం’లో తలో దిక్కున కూర్చున్న సీఎం జగన్, చంద్రబాబు
వారం కిందట విజయవాడ వచ్చిన అమెజాన్ ప్రతినిధులతో సెర్ప్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా అమెజాన్‌లో చోటు కల్పించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. కాగా డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలపై విధివిధానాలను అమెజాన్ ప్రతినిధులు ఈ నెల 18న సెర్ప్ అధికారులకు అందజేయనున్నారు. డ్వాక్రా ఉత్పత్తులను సరఫరా చేసేందుకు స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలి. ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను అందుబాటులో ఉంచాలి. దీంతో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసే అంశంపై సెర్ప్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అటు అమెజాన్ ద్వారా డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాలు మొదలైతే.. ఏపీలో తయారవుతున్న వస్తువులకు గిరీకీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.