Bharatiya Janata Party: ఏపీలో రహదారులపై గతంలో సోషల్ మీడియా వేదికగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన పార్టీ సెటైర్లు వేసింది. జనసేన పార్టీ ఫోటోలు తీసి పోస్ట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా జనసేన బాటలోనే కొనసాగుతోంది. ఇటీవలే ప్రారంభమైన జనసేన ప్రచారం ఇంకా కొనసాగుతుండగా… ఏపీలో ఆ పార్టీతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ కూడా తాజాగా రోడ్ల దుస్థితిపై ప్రచారం మొదలుపెట్టింది. జనసేన మాదిరే కార్టూన్లతో బీజేపీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఓ సెటైరికల్ కార్టూన్‌ను సంధించింది.
జగన్ రోడ్లు- నరకానికి దారులు పేరుతో బీజేపీ తన ట్విట్టర్ ద్వారా ఓ పోస్టును పెట్టింది. ఈ సందర్భంగా సదరు పోస్టులో ‘వైసీపీ ప్రభుత్వ సిత్రాలు… రాష్ట్ర రోడ్లు’ అంటూ ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది. ఈ కార్టూన్ లో విజయవాడకు 5 కిలో మీటర్ల దూరంలో కారులో వెళుతున్న ఓ వ్యక్తి.. రోడ్డు పక్కగా కూర్చుని మద్యం తాగుతున్న ఓ వ్యక్తిని ‘ఈ రోడ్డు ఎక్కడికి వెళుతుంది’ అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా… ‘ఏముంది? డైరెక్ట్‌గా పైకే’ అంటూ సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా ‘ఈ రోడ్డు ఎక్కడికి పోతుందో తెలియదు గానీ… నీ కారేమో షెడ్డుకు, నువ్వేమో హాస్పిటల్‌కి మాత్రం పక్కాగా వెళతారు’ అంటూ సెటైర్ సంధిస్తాడు.కాగా ఇటీవల విశాఖపట్నంలో ఓ వ్యక్తిని రోడ్డుపై ఉన్న గుంత మింగేసింది. ఈ నెల 4న రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ కు బైక్ పై వెళ్తున్నాడు. మధ్యలో రోడ్డుపై గుంతను చూసుకోలేదు. దీంతో ఆ గుంతలో పడ్డాడు. బైక్ నడుస్తున్న వేగమో, గుంత లోతో తెలియదు కానీ రోడ్డుపై పడిపోయాడు. అంతే గుంతలో పడి సుబ్బారావు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో రోడ్ల విషయంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగాయి.
జగన్ రోడ్లు – నరకానికి దారులు pic.twitter.com/c0XKVRYaLO
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) August 19, 2022