ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విపక్ష టీడీపీ తరఫున సభలో ఆ పార్టీ ఉప నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
బీఏసీ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. వయస్సులో అంతపెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదన్నారు.
కాగా బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న విషయంపై చర్చ జరిగింది. ఇరు వర్గాల వాదనల మేరకు ఈ నెల 25 వరకు సమావేశాలను కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించారు. అంటే సెలవులు మినహా మొత్తం 13 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.