Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. చివరి రోజు జరిగిన సమావేశాల్లో మొత్తం 9 బిల్లులు ఆమోదం పొందాయి. బుధవారం మూజువాణి ఓటుతో తొమ్మిది బిల్లులను సభ ఆమోదించింది. ఈ బిల్లుల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా సవరణ బిల్లును ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి విడుదల రజినీ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ (రెండో సవరణ) బిల్లు 2022, కార్మిక ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రవేశపెట్టారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ జీతాలు, పెన్షన్ చెల్లింపులు, తొలగింపుల అనర్హత (సవరణ) బిల్లు 2002, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్‌కు నియామకాల నియంత్రణ, స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్ (సవరణ) బిల్లు 2022 కూడా ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు 2022 లను కూడా సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ విభజన (నం.3) బిల్లు 2022 ను కూడా సభ ఆమోదించింది. ఈ బిల్లులన్నీ మూజువాణి ఓటుతో ఆమోదించడం గమనించాల్సిన విషయం.
కాగా అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో జగన్‌ను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కలిశారు. మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని భూమన కరుణాకర్‌రెడ్డి ఐదువేల కాపీలను ముద్రించారు. వీటిని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కాపీలను విజయనగరంలోని గురజాడ ఇంటికి బహూకరించి సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు భూమన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
