Anantapur: అనంతపురం నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతో పీఠంపై ఉంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 48 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వారిద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వసీం సలీంని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అది అప్పట్లో చాలామందికి నచ్చలేదు. పైగా అనంత వెంకటరామిరెడ్డికి మేయర్ వసీంకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు. మొన్నటివరకు అధికారం ఉండటంతో అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పడు వాయిస్ మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ ని దించుతారన్న టాక్ నడిచింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మొదట తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన మరో ముగ్గురు కూడా పార్టీ మారారు. టీడీపీ వైపు మొత్తం ఐదుగురు కార్పొరేటర్లు వచ్చారు. నాలుగేళ్ల పదవీకాలం ముగియడంతో మేయర్‌ని దించాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవిశ్వాసం పెడతారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. పైగా వైసీపీలో చీలికలు వచ్చాయని, మేయర్‌ని దించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నదానికి బలం చేకూరింది. అర్బన్ ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు..
Read Also: HYDRA : మరోసారి హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
టీడీపీ వైపు ఉన్న ఐదుగురు కార్పొరేటర్లతో సహా 18 నుంచి 22 మంది అవిశ్వాసానికి ఓకే చెప్పినట్లు మేయర్ యాంటీ వర్గం ప్రచారం చేసుకుంటోంది. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే నెంబర్ 26 ఉండాలి. ప్రస్తుతం 22 మంది ఉన్నారని మేయర్ వ్యతిరేకవర్గం చెబుతోంది. ఎక్స్ అఫిషియో కలుపుకుంటే ఫిగర్ 24కు చేరుతుంది. ఇంకో ఇద్దరు కార్పొరేటర్లను లాగడం పెద్ద విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో అన్నిరకాల ఆఫర్లు వదులుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో మద్దతు పలికే కార్పొరేటర్లందర్నీ తీసుకుని విజయవాడకు వెళ్ళనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కండువాలు మార్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద ఉగాదిలోపే మేయర్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి ఆ పీఠంపై కొత్త వ్యక్తి కూర్చోబెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసం తెరవెనుక అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.