Uravakonda Library: సినీ సెలబ్రిటీలు, పేరుమోసిన రాజకీయ నేతలు లైబ్రరీలకు వెళ్లి ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి.. అయితే, అక్కడ మాత్రం నిత్యం సినీ సెలబ్రిటీలు వస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సహా పలువురు ప్రముఖులు ఉరవకొండలోని ప్రభుత్వ గ్రంథాలయానికి పుస్తకాలు చదవడానికి వస్తున్నారంట… వినడానికి , చదవడానికి ఆశ్చర్యం కలిగించే అంశమైన… లైబ్రరీ రిజిస్టర్ లో సంతకాలు మాత్రం ఇదే చెబుతోంది. అందులో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం చర్చగా మారింది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ గ్రంథాలయం శిథిలం కావడంతో కొత్త భవనం నిర్మాణం నిమిత్తం పలు వివరాలతో రావాలని మంత్రి పయ్యావుల కేశవ్.. గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డిని ఆదేశించారు.. గ్రంథాలయానికి నిత్యం వస్తున్న పాఠకుల రిజిస్టర్ తోపాటు నిల్వ ఉన్న పుస్తకాలు, ఇతరత్రా సమాచారంతో మంత్రి కార్యాలయానికి వెళ్లారు. పాఠకుల హాజరు పుస్తకాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా చదివారు. అందులో మాజీ మంత్రి దివంగత పరిటాల రవి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, సినీ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులు పుస్తక పఠనానికి వచ్చినట్లు ఉంది. దీనిని పరిశీలించిన మంత్రి విస్తుపోయారు. వీరంతా గ్రంథాలయంలో పఠనానికి వస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించగా.. దానికి ప్రతాపరెడ్డి సమాధానం ఇవ్వలేని పరిస్థితి.. సంబంధిత అధికారి అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల పేర్లతో ఉన్న సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కేసు నమోదు చేయాలని సీఐ మహానందిని మంత్రి ఆదేశించారు. వెంటనే సీఐ ఆ దస్త్రాలు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. అయిదే అది ఆకతాయిల పనా..? లేదా నిర్వాహకులే.. రిజిస్టర్‌లో ఎక్కువ పేర్లు కనబడాలని ఈ పని చేశారా? ఇంకా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది..