Anam Ramnarayana Reddy: ఏపీలో జగన్ ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఏడాది ముందే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియడంలేదన్నారు. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడంలేదో అర్థంకావడం లేదని ఆనం వ్యాఖ్యానించారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
Read Also: Google Maps : తెలంగాణలో రోడ్లను మ్యాప్ చేయడానికి శాటిలైట్ సెన్సింగ్ సిస్టమ్
అధికారులను అడిగితే త్వరలో పూర్తిచేస్తామంటున్నారని, కానీ అవి పూర్తయ్యేలోపు తమ పదవీకాలం పూర్తవుతుందని ఆనం రాంనారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. కార్యాలయాలు లేకపోతే సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చుని పనిచేయాలని ప్రశ్నించారు. మరోవైపు ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఇటీవల తరచూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆనంపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా ఆనం రాంనారాయణరెడ్డి స్థానంలో రాంకుమార్‌రెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా వెంకటగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా రాంకుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని ఆనం అన్నారు. పార్టీ నుంచి ఎవరూ మాట్లాడలేదని.. మంత్రి కాకాణితో పాటు కొందరు నేతలు బాధను వ్యక్తం చేశారని తెలిసిందని.. మీడియాలో వచ్చే కథనాలపై స్పందించే సమయం ఇది కాదన్నారు.