‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీన్ని బట్టే వైసీపీ పాలన పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలిసిపోతోందని టీడీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఆయన తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు.
తమ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 95% పూర్తి చేశామని రాంబాబు అన్నారు. అందులో తామేం చేశామని, ఏం చేయలేదన్న విషయాల్ని రాసి.. గడప గడప కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇస్తున్నమమన్నారు. ప్రపంచంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇచ్చిన వాగ్దానాల్ని పూర్తి చేసి ఉండదని చెప్పారు. తాము ధైర్యంగా ప్రతి పనిని చేశామని ప్రజలకు చెప్తున్నామని, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోనే దాచేసిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒక దస్తాలాగా 45 పేజీల మేనిఫెస్టోని సిద్ధం చేసిన టీడీపీ.. అధికారంలోకి రాగానే దాన్ని దాచేసిందని, ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో వెబ్‌సైట్‌లో నుంచి కూడా తొలగించిందని తెలిపారు.
‘మనం ఇతిహాసాల్లో, పురాణాల్లో అబద్ధాలు చెప్పని వ్యక్తి ఎవరని ప్రశ్నిస్తే.. సత్యహరిశ్చంద్రుడు అని ఠక్కున చెప్తాం. ప్రాణం పోయినా, ఆస్తులు పోయినా.. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా తన జీవితంలో అబద్ధాలు తప్ప నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు నాయుడు’’ అంటూ మంత్రి ఆరోపించారు. వైస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని.. ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నంలో తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.