Ambati Rambabu: చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పుట్టిందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ ఆశ్చర్యకర పరిణామం కాదన్నారు. ప్యాకేజీ తీసుకుని చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన మోస్తాడని ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ళ క్రితమే చెప్పారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. వాళ్ళిద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కాదు టీడీపీ పరిరక్షణ కోసం చర్చించుకున్నారని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కృషికి చంద్రబాబు ఎంత ఇవ్వాలి అనేది చర్చించుకున్నారని విమర్శించారు. ఈ ఎపిసోడ్‌లో ఆశ్చర్య పోవాల్సింది బీజేపీ అని.. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని నమ్మే అమాయకులు కూడా ఆశ్చర్యపోవాలని అంబటి రాంబాబు అన్నారు.
Read Also: Pawan Kalyan Met Chandrababu Live: చంద్రబాబు-పవన్ భేటీ.. పొత్తుపై క్లారిటీ ఇస్తారా?
కందుకూరు, గుంటూరు ఘటనలు ప్రభుత్వం కుట్ర అంటున్నారని.. పోలీసులదే బాధ్యత అంటున్న చంద్రబాబు కుప్పంలో పోలీసులు వస్తే ఎందుకు ఊగిపోయాడని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సంస్కారం లేని వ్యక్తి అని ఆయన ఆరోపించారు. ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబును ప్రేమించడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. దేశంలోనే అనైతిక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కలిసి రండి.. కలిసికట్టుగా టీడీపీ, జనసేన పార్టీలను జగన్ బంగాళాఖాతంలో పడేస్తాడని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిపేశాడని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీలో కలపడానికి సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌లా చిరంజీవి డ్రామాలు ఆడలేదన్నారు. చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని అంబటి అభిప్రాయపడ్డారు.