Site icon NTV Telugu

YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Ysr Padayatra Completes 23

Ysr Padayatra Completes 23

YSR Padayatra Completes 23 Years: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన ట్వీట్‌లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్ర చరిత్రను తిరగరాసిన పాదయాత్ర” అంటూ పేర్కొన్న జగన్, ఒక నాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను, ప్రజల జీవితాలను ఎలా మార్చగలదో తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిరూపించారని అన్నారు. 2003 ఏప్రిల్ 9న ఎండలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ప్రారంభమైన ఆ పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని గుర్తుచేశారు.

Read Also: RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు “నేనున్నాను” అనే భరోసా కలిగిందని, రాష్ట్ర ప్రజలు భారీగా మద్దతు ఇచ్చి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసి రైతులకు ఉపశమనం కల్పించారని పేర్కొన్నారు వైఎస్‌ జగన్.. అంతేకాక, వైఎస్‌ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని జగన్ అన్నారు. రైతులను బలోపేతం చేయడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం వంటి చర్యలు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చాయని చెప్పారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆయన చేసిన సంస్కరణలు అనేక మంది పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు కావడానికి దోహదపడ్డాయని వివరించారు జగన్. అలాగే సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి అయిన Polavaram Project పనులకు వేగం తీసుకువచ్చారని తెలిపారు. తన తండ్రి వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్న జగన్, ఆ పాదయాత్ర స్ఫూర్తితో తన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదిక వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Exit mobile version