YS Jagan Districts Tour: క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు.. ఈ రోజు తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఇక, సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని.. ఆ రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని.. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని వెల్లడించారు..
Read Also: Pushpa 2 : సుకుమార్ కు ఎప్పటికి రుణపడి ఉంటా : అల్లు అర్జున్
కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు వైఎస్ జగన్.. జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలి. జిల్లాస్ధాయి నుంచి మండల స్ధాయి వరకు పూర్తవ్వాలి. ఆ తర్వాత బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు జరగాలి. గ్రామస్ధాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సప్ ఉండాలని సూచించారు వైఎస్ జగన్.. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. ప్రతి గ్రామంలో టీడీపీని, సీఎం చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు.. ఇక, చంద్రబాబు సాధ్యం కాని హామీలిచ్చారని విమర్శించారు వైఎస్ జగన్. మనకు అబద్దాలు చెప్పడం చేతగాదు. మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు.. కానీ, ఆరు నెలలు తిరక్కమునుపే వాస్తవం అర్ధమయిందన్నారు.. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రతి వ్యవస్ధ కుప్పకూలిపోతుంది. ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని దుస్థితి. జనవరి నాటికి ఏడాది ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు.. నేను మీ అందరికీ కోరేది ఒక్కటే.. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదని ధైర్యాన్ని చెప్పారు వైఎస్ జగన్.. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష సమయం అన్నారు.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు.. బెయిల్ కూడా ఇవ్వలేదు అంటూ తన నిజజీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్నారు వైఎస్ జగన్.