YS Jagan Security Failure: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భద్రతా వైఫల్యంపై రేపు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నజీర్‌ను.. కలవనుంది వైసీపీ నేతల బృందం. జగన్‌కు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు. గవర్నర్‌ను కలవనున్న వైసీపీ బృందంలో.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్.. భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయం గుంటూరు మిర్చియార్డ్‌కు జగన్ వెళ్లిన సందర్భంగా… జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారని.. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నా.. పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు.
Read Also: NDRF Funds: తెలంగాణకు అదనంగా రూ. 231.75 కోట్ల కేంద్ర నిధులు
వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని, మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్ పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినా, ఆయనకు భద్రత కల్పనను అస్సలు పట్టించుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని విమర్శించారు.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంపై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు చేయనుంది. మిర్చి రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పిచేందుకు జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు. ధర లేక కునారిల్లుతున్న మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రైతులతో మాట్లాడి వెళ్లగానే, వ్యవసాయ మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఒకటి, రెండుసార్లు తప్ప ఎప్పుడూ క్వింటా మిర్చి రూ.13 వేలకే విక్రయిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.. మరో వైపు హడావిడిగా సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు లేఖ రాశారు. మిర్చిపంటకు రేటు పడిపోయింది, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారని గుర్తుచేశారు..