PM Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. వచ్చేనెల 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామానికి రానున్నారు.. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ.. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర.. రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఆయన పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు.
Read Also: KL Rahul-LSG: ఊహాగానాలకు చెక్.. లక్నోతోనే కేఎల్ రాహుల్!
అయితే, కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వివిధ పరిశ్రమలు.. ఇతర అవసరాల కోసం 20 వేల ఎకరాల భూమిని ఇదివరకే సేకరించారు. ప్రస్తుతం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కోసం 12 వేల 500 ఎకరాలను కేటాయించారు. ఈ సెజ్ పరిధిలో ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో రానున్నాయి. క్రిస్ సిటీ కోసం సేకరించిన భూములలో మౌలిక సదుపాయాలను కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి. ఇప్పటికే సాగర మాల పథకం కింద తీర ప్రాంతంలో రహదారి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండడంతో ఎగుమతులు.. దిగుమతులకు సౌలభ్యంగా ఉంటుందని భావించి ఈ ప్రాంతంలో పారిశ్రామిక సెజ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెజ్ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావించినా.. అప్పట్లో వివిధ కారణాలవల్ల ప్రధాని పర్యటన వాయిదా పడింది. ఇక, ఇప్పుడు ప్రధాని పర్యటన ఖరారు కావడంతో.. అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు.