Minister Narayana : రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తాం… రైతులు ఎవరు ఏ సమస్య చెప్పినా పరిష్కరిస్తామని తెలిపారు మంత్రి నారాయణ.. రాజధాని ప్రాంతంలో సిటీస్ (CITIIS) ప్రాజెక్ట్ కింద నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లను మంత్రి నారాయణ ఈ రోజు ఉదయం పరిశీలించారు. వెంకటపాలెం, ఉద్దండరాయినిపాలెం ప్రాంతాల్లో జరిగిన పర్యటన సందర్భంగా అధికారులు చేపట్టిన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా 15 అంగన్వాడీ కేంద్రాలు పూర్తి చేశాం.. 14 హెల్త్ సెంటర్లు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్ చివరి నాటికి మిగతా నిర్మాణ పనులు పూర్తి అవుతాయని తెలిపారు..
రాజధాని రైతులకు హామీ ఇచ్చిన మౌలిక సదుపాయాలు వేగంగా చేపడుతున్నాం.. వచ్చే మూడు ఏళ్లలో అన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తవుతాయి అన్నారు మంత్రి నారాయణ.. మొత్తం ప్లాట్లు 69,421 అయితే.. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల సంఖ్య 61,433గా ఉంది.. రిజిస్ట్రేషన్ చేయాల్సినవి 7,899గా ఉన్నాయన్నారు.. అయితే, గత 21 రోజులలో 240 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాం. ప్రస్తుతం రోజుకు 30–40 ప్లాట్లు రిజిస్టర్ అవుతున్నాయి అని వెల్లడించారు..
రాజధాని కోసం భూ సేకరణలో 30,635 మంది రైతులు భూములు ఇచ్చారు. అందులో 29,600 మందికి రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా 2,779 రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు మంత్రి నారాయణ. రైతుల సమస్యలపై స్పందిస్తూ.. కొంతమంది రైతులు తమకు కావలసిన చోటే ప్లాట్లు ఇవ్వాలని అంటున్నారు. వారి సమస్యలు వినిపిస్తున్నాం.. కొందరు రైతులు సోషల్ మీడియాలో అనవసరంగా పోస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, విదేశాల్లో ఉన్న రైతులు తిరిగి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తాం అని వెల్లడించారు.. రాజధాని రైతులకు న్యాయం చేయడం మా బాధ్యత. ఎవరైనా సమస్య చెప్పినా పరిష్కరిస్తాం. ఎవరైనా విచారణకు రావాలంటే మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు మంత్రి నారాయణ..