Minister Atchannaidu: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.. ఆందోళన చెందవద్దు అన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆయన.. నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు.. అయితే, గతంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.. వైఎస్ జగన్ రైతులను ఆదుకోవడం మర్చిపోయి.. విలాసాలు కోసం వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెక్టార్‌కు ఇన్‌పుట్ సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అందించిన విషయం జగన్ రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు.
Read Also: DD vs LSG: వైజాగ్ ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి వస్తుందా?
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటుందన్నారు అచ్చెన్నాయుడు.. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు కొన్నిచోట్ల అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని వివరించారు.. గత అయిదేళ్లలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఒక్క ఏడాది కూడా ఆదుకోలేదన్నారు.. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అకాల వర్షాలతో నష్టపోయి రోడ్డున పడ్డా పరిహారం అందించకుండా జగన్ రెడ్డి విలాసాల కోసం వేలకోట్లు వృథా చేశారని ఆరోపించారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం అందించి రైతులకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 మేర ఇన్ పుట్ సబ్సిడీ అందచేస్తాం.. మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టారుకు రూ.75 వేలు అందజేయడం జరుగుతుంది. మొత్తం రూ.1,10,000 వరకు సాయం అందుతుందన్నారు.. ఇన్సూరెన్స్ ఉంటే వారికి అదనంగా చెల్లింపులు ఉంటాయని వెల్లడించారు.. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలో ఎన్యూమరేషన్ ప్రక్రియ మొదలవుతుంది. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ఆందోళన చెందవద్దు అని ధైర్యం చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు..