Schools Water Bell: రాష్ట్రంలో ఎండ తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేన్‌మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని స్పష్టం చేశారు.. ఎండ వేడిమి, హీట్ వేవ్స్ సమాచారాన్ని మొబైల్ అలెర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు సీఎం చంద్రబాబు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని సూచించారు.. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం జరగాలని ఆదేశించారు.. ఇక, ఎండల తీవ్రత దృష్ట్యా.. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు వీలుగా స్కూళ్లలో వాటర్ బెల్ మోగించాలని తెలిపారు.. ఇక, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు, వేసవిలో తరచూ అడవుల్లో మంటలు వ్యాపించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో.. అడవుల్లో అగ్నిప్రమాదాలుపై అప్రమత్తంగా ఉండాలన్నారు.. డ్రోన్లతో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..