CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!

Cbn

Cbn

CM Chandrababu: హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయవంతంగా ముగిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన పలు రాజకీయ అంశాలపై స్పందించారు. ఈసారి నిర్వహించిన మహానాడుకు ప్రత్యక్షంగా, వర్చువల్‌గా భారీ స్థాయిలో స్పందన లభించిందని పేర్కొన్నారు. 24 లక్షల మందికిపైగా వర్చువల్‌గా మహానాడులో పాల్గొనడం విశేషమని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల భాగస్వామ్యం మహానాడును విజయవంతం చేసిందన్నారు.

రాజకీయాలపై మాట్లాడిన చంద్రబాబు, నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలించవచ్చని చెప్పేవారు, కానీ జిల్లాల్లో నాయకులు రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని స్పష్టం చేసిన ఆయన, నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారం సాధించవచ్చని భావించారని, కానీ ఆ ఆలోచన విఫలమైందన్నారు. హింసే నక్సలిజం వైఫల్యానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. “గొడ్డలితో పరిపాలన సాగిస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం” అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ప్రజల మద్దతు పొందాలని సూచించారు.

×
×
Ad

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో కూడా చంద్రబాబు స్పందించారు. వివేకా ఆత్మశాంతి కోసం ఆయన కుమార్తె సునీత పోరాటం చేస్తున్నారని, ఆమె చేస్తున్న న్యాయపోరాటం వల్ల అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. తవ్వేకొద్దీ మరిన్ని అంశాలు బయటపడుతున్నాయని, ఇంకా ప్రజలు ఊహించని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘సైకో’ అనే పదం కంటే ‘గొడ్డలి పార్టీ’ అనే అంశాన్ని ప్రజలు ఎక్కువగా గుర్తిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశం ప్రజల్లోకి వెళ్తున్న కొద్దీ వైసీపీ అధినేత జగన్‌లో అసహనం, నిరాశ పెరుగుతోందని అన్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కడప జిల్లాలో ప్రచురితమైన ‘పాలెగాళ్ల రాజ్యం’ పుస్తకాన్ని ఇప్పుడు చాలామంది చదువుతున్నారని, అందులో ప్రస్తావించిన విషయాలపై చర్చ జరుగుతోందని చెప్పారు.

వైఎస్ కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలు తనకు కూడా తెలియవని, ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ధోరణులు ఉన్నవారు ఎలా సరిపోతారనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోందన్నారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై కూడా సీఎం స్పందించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని చెప్పారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేసే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..