AP High Court: ఒక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అంతేకాదు.. అతని ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు చెల్లదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చర్చి నిర్వహించడంపై అక్కల రామిరెడ్డి మరియు ఇతరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో కక్షపూనిన చింతాడ ఆనంద్, SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు.. దీంతో, సదరు కేసును కొట్టివేయమని కోరుతూ అక్కల రామిరెడ్డి మరియు ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ, చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నందున వల్ల అతను క్రైస్తవుడవుతాడని, షెడ్యూలు కులాల రాజ్యాంగ ఆదేశం, 1950లోని 3వ నిబంధన ప్రకారం హిందువు కాని ఏ వ్యక్తి అయినా షెడ్యూల్ కులస్తుడు కాజాలడనీ, పుట్టుకతో హిందువు అయినప్పటికీ మతం మారడం వలన ఆనంద్ షెడ్యూల్ కులానాకి చెందడని.. అందువలన అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు అతనికి వర్తించవని, అందువల్ల సదరు కేసుకు విచారణ అర్హత లేదని వాదనలు వినిపించాడు..
Read Also: India Pakistan: పాక్ యాక్టర్లు, సెలబ్రిటీలకు ఇండియా బిగ్ షాక్..
అంతేగాక, హిందూ మతంలోని కుల ప్రస్తావన ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీయ, క్రైస్తవ మతాలలో లేదని, అందుచేత ఆనంద్ యొక్క ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని, ఫిర్యాదు కొనసాగించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని వాదించారు. మరోవైపు.. ఆనంద్ తరఫు న్యాయవాది సతీష్ కుమార్ వాదిస్తూ, ఆనంద్‌కి ప్రభుత్వం యొక్క గుర్తింపు SC-హిందూ సర్టిఫికేట్ ఉన్నదని, అందువల్ల అట్రాసిటీ చట్టం ఆనంద్‌కి వర్తిస్తుందని తెలిపారు. దీనిపై అభ్యంతర తెలిపిన న్యాయవాది ఫణిదత్, ఒకవ్యక్తి ప్రభుత్వ అధికారులకి తప్పుడు సమాచారం ఇచ్చి పొందిన సర్టిఫికెట్ చెల్లదని మరియు చెల్లని సర్టిఫికెట్‌తో ఇతరులపై తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం.. చట్ట దుర్వినియోగం అవుతుందని తెలిపారు. ఇరువాదనలు విన్న హైకోర్టు మతం మారిన SC వ్యక్తి హిందువు కాజాలడనీ, అతనికి SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదనీ తీర్పునిచ్చింది.