AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..

Ap Cabinet Key Decisions

Ap Cabinet Key Decisions

AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో మొత్తం 37 కీలక అంశాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, పర్యాటకం, విమానయాన రంగం, ఉపాధి కల్పన, అవయవ దానం నియంత్రణ వంటి పలు రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు..

కేబినెట్‌ కీలక నిర్ణయాలు
* అమరావతి హైకోర్టు భవన సముదాయంలో ప్రీకాస్ట్ ఫిన్స్, వాటర్‌బాడీస్, బాహ్య రహదారుల నిర్మాణ పనుల కోసం రూ.547.07 కోట్ల నిధులను కేబినెట్ ఆమోదించింది. అలాగే కృష్ణా నది తీరాన 6 ఎకరాల విస్తీర్ణంలో డీబీఎఫ్ఓటీ (DBFOT) పద్ధతిలో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతి ఇచ్చింది.

×
×
Ad

* అమరావతిని సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ ప్రాజెక్టు కోసం ఐటీ శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించింది. మరోవైపు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బంగ్లాల్లో హోమ్ ఆటోమేషన్, ప్రీమియం సదుపాయాల కోసం రూ.94.90 కోట్ల ఎల్-1 బిడ్‌కు కూడా ఆమోదం తెలిపింది.

* రాజధాని ప్రాంత భూముల ల్యాండ్ పూలింగ్ నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ సవరణ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది. విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో స్టార్ హోటళ్లు, రిసార్టుల అభివృద్ధి కోసం ఏపీటిడీసీకి 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని బదలాయించాలని నిర్ణయించింది.

* రాష్ట్ర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ లక్ష్యంగా రూపొందించిన ‘ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31’కి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటకాభివృద్ధికి ఊతమిచ్చేలా చీరాల, విశాఖపట్నం తీర ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్ ఎక్సైజ్ పాలసీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

* ఏపీ ఫైబర్‌నెట్ సేవల విస్తరణ కోసం హడ్కో నుంచి రూ.300 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల కనెక్టివిటీ మెరుగుదలకు జాతీయ రహదారి-216 నుంచి రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు భూములు కేటాయించింది.

* పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజీలు 5, 5A పరిధిలో మిగిలిన పనుల పూర్తి కోసం రూ.796.66 కోట్ల సవరించిన పరిపాలనా ఆమోదం మంజూరు చేసింది. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అవకాశాల పెంపు కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల 60:40 భాగస్వామ్యంతో జూలై 1 నుంచి ‘వికసిత్ భారత్ – రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ చట్టాన్ని అమలు చేయనుంది.

* అవయవ దానాలు, మార్పిడి ప్రక్రియలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ‘మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్-2026’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాకినాడ అర్బన్ పరిధిలో టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కోసం 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 ఏళ్ల లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా పరిశీలించింది.

* అగ్రిగోల్డ్ కేసులు, డిపాజిటర్ల రక్షణ చట్టం (APPDFE) కేసుల విచారణను వేగవంతం చేసేందుకు అదనంగా 21 పోస్టులను మంజూరు చేసింది. అలాగే వట్టిచెరుకూరు గ్రామంలోని 25.37 ఎకరాల భూమిని ‘చెరువు పోరంబోకు’ నుంచి ‘గ్రామ కంఠం’గా మార్చుతూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను క్రమబద్ధీకరించింది. ఇక, రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి..