Amaravati Relaunch: అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ.1,07,002 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. రూ.49,040 కోట్ల రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.58 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోడీ జాతికి అంకితం చేస్తారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధాన పథకాల కల్పనలో భాగంగా ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఒక రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ.11,240 కోట్ల వ్యయంతో శాసనసభ, హైకోర్టు, సచివాలయంతో పాటు ఇతర పరిపాలన భవనాలు, 5,200 కుటుంబాలకు గృహవసతి నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతుంది. కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో సుమారు రూ.1,500 కోట్లతో నిర్మించే మిస్సైల్ టెస్ట్ రేంజ్, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్, రూ.293 కోట్లతో గుంతకల్లు వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టు,రూ.3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. రూ.3,680 కోట్ల విలువైన పలు జాతీయ రహదారి పనులు, రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్, గుంటూరు-గుంతకల్లు డ బ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనప ల్లి, కేయీఎఫ్ పాణ్యం లైన్‌ల ప్రారంభోత్సవం చేస్తారు మోడీ.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం రూ.15 వేల కోట్ల విలువైన పనులతో మొదలైంది. ఇప్పుడు పునర్నిర్మాణాన్ని రూ.70 వేల కోట్ల పనులతో శ్రీకారం చుడుతున్నారు. రూ.49 వేల కోట్ల విలువైన పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇక అమరావతిలో కేంద్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పెట్టే పెట్టుబడులు కలిపితే మొత్తం రూ.లక్షన్నర కోట్లకు చేరుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రూ.30 వేల కోట్ల మేర అమరావతి పెట్టుబడులను ఆకర్షించింది. విద్య, పరిశోధనాభివృద్ధి, ఆరోగ్యం, ఆతిథ్యం, బ్యాంకులు, కేంద్ర సంస్థల రూపేణా రూ.30 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ జరిగింది. ఈ సంస్థలన్నీ శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభిస్తాయి. అమరావతి చుట్టూ మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు అయ్యే రూ.35 వేల కోట్ల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టు సాకారమైతే అమరావతే కాకుండా రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ భారీ ప్రాజెక్టుకు ఇటీవలే కేంద్రం అనుమతులిచ్చింది. భూ సేకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిని 14 వరుసలుగా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు వస్తే ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని కంకిపాడు, పెనమలూరు, గన్నవరం, ఆగిరిపల్లి, మైలవరం, నందిగామ వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి.
Read Also: Mangaluru Tension: హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్.. పోలీసుల హై అలర్ట్
ఇక అమరావతి పునర్నిర్మాణ పనులు పెద్దఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బస్సులో 120 ఆహారపొట్లాలు, 100 అరటిపండ్లు, 120 నీటి సీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్‌లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. దారిలో అల్పాహారం, సభకు వచ్చే సమయానికి భోజనం చేసి ప్రాంగణంలోకి చేరుకుంటారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్‌కు సంబంధించిన ఆహారం ఆయా బస్సుల దగ్గరకు చేర్చే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంది. కిచిడి, చట్నీతోపాటు ఒక ఆరెంజ్ పండు అందరికీ అందిస్తారు. తిరుగు ప్రయాణంలో దారిలోనే డిన్నర్ ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్గమధ్యలో ఉన్న ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. సభాప్రాంగణంలో ప్రతి గ్యాలరీలోనూ ఆరుగురితో కూడిన వైద్య బృందం ఉంటుంది. ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎక్కడికి తరలించాలో గ్యాలరీ ఇంఛార్జ్ అధికారి సమన్వయం చేసుకుంటారు. మొత్తానికి అమరావతిలో మళ్లీ ఆశలు రేకెత్తాయి. శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు 2.O మొదలైంది. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిగా చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.