మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తమై.. మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
మే 1న రాత్రి 8:30 గంటలకు సుహాస్ శెట్టి.. మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బాజ్‌పేలోని కిన్నికంబ్లాలో కారులో ప్రయాణిస్తున్నాడు. ఆరుగురు ప్రత్యర్థులు కారును అడ్డగించి.. కారులోంచి సుహాస్ శెట్టిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హత్య తర్వాత స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘర్షణలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: AP Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..! అన్నయ్య అంటూ పరిచయం చేసి..!
మంగళూరు ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) ఆర్ హితేంద్ర మాట్లాడుతూ.. ‘‘నిన్న సాయంత్రం సుహాస్ శెట్టి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అనంతరం నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. పోస్ట్‌మార్టం జరుగుతోంది. దహన సంస్కారాలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మంగళూరు పౌరులు శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను గుర్తించాం. పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: JD Vance: ఉగ్ర వేటలో భారత్‌కు సహకరించండి.. పాక్‌కు జేడీవాన్స్ సూచన
మంగళూరు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘సంఘటన గురువారం రాత్రి 8.27 గంటల ప్రాంతంలో జరిగింది. సుహాస్ వాహనంలో సంజయ్, ప్రజ్వల్, అన్విత్, లతీష్, శశాంక్‌తో కలిసి ప్రయాణిస్తుండగా ఐదు నుంచి ఆరుగురు వ్యక్తుల ముఠా వారిని అడ్డగించారు. దుండగులు సుహాస్ బయటకు లాగి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆసుపత్రికి తరలించారు కానీ కొద్దిసేపటికే మరణించారు.’’ అని పేర్కొన్నారు.
కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ.. ‘‘నిందితులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. మేము ఎవరినీ వదిలిపెట్టము. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది శాంతిభద్రతల వైఫల్యం కాదు. కర్ణాటకలో మేము శాంతిని కాపాడాము.’’ అని ఆయన అన్నారు.
బెంగళూరు ఎంపీ పీసీ మోహన్.. దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ‘‘మంగుళూరులో అనుమానిత జిహాదీ శక్తులు హిందూ కార్యకర్త సుహాస్ శెట్టిని దారుణంగా హత్య చేయడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి హేయమైన చర్యలు కర్ణాటకలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనం. నా ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
సుహాస్ శెట్టిపై కనీసం ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022లో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన కొద్ది రోజులకే సూరత్కల్‌లో 23 ఏళ్ల యువకుడు ఫాజిల్‌ను నరికి చంపిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఫాజిల్ హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుతం ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర పి, కానిస్టేబుల్ యల్లలింగలను సస్పెండ్ చేశారు.