Godavari Floods: గోదావరి ఉగ్రరూపంతో అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో వరద భయం నెలకొంది. కూనవరం, శబరి – గోదావరి సంగమం వద్ద నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఇళ్లల్లోని సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉండడంతో గత కొన్నేళ్లుగా గోదావరి వరదలకు విలీన మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. వరద నేపథ్యంలో ఎటపాక, వీఆర్ పూరం, చింతూరు మండలాల్లో పోలీస్ కంట్రోల్ రూంలను అధికారులు ఏర్పాటు చేశారు. రహదారులు నీట మునగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. అటు రాజమండ్రి వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద ప్రవాహం వస్తుండటంతో.. రేపు ఉదయానికి 8 లక్షల క్యూసెక్కుల వరకు చేరుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Sleep Paralysis: నిద్రలో దెయ్యం ఛాతిపై కూర్చొని మెడ నొక్కేస్తున్నట్టు అనిపించిందా..?
అయితే, 175 గేట్ల నుంచి వరద నీరు వచ్చింది వచ్చినట్లుగా విడుదల చేయడంతో దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాలకు వరద తాకిడి క్రమంగా పెరుగుతుంది. పి. గన్నవరం మండలం గంటి పెద్దపూడి వద్ద గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. లైఫ్ జాకెట్లు తదితర రక్షణ చర్యలు పట్టించాలని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. గౌతమి- గోదావరి వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం- కోటిపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రభావం నేపథ్యంలో అధికారుల అప్రమత్తం అయ్యారు.