తెనాలి అసెంబ్లీ స్థానంపై ఆసక్తికర కామెంట్లు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, తాను మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆలపాటి.. ఒక సీటు అని రాసి పెట్టలేదని.. తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేదన్నారు.. అధికారం నాకు కొత్త కాదని స్పష్టం చేశాసిన ఆయన.. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశానని గుర్తుచేశారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తన గురించి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు రాజా. తాను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం లేదని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు.. మరోవైపు.. జనసేన పార్టీతో పొత్తు విషయంపై స్పందిస్తూ.. పొత్తుల వ్యవహారం పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు.. నా రాజకీయ భవితవ్యం కూడా చంద్రబాబు చూసుకుంటారని పేర్కొన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజా.. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇక, తాను తెలుగు యువత నాయకుడిగా 1989 నుంచి 1994 వరకు పని చేసిన విధానం అందరికీ తెలుసన్న ఆయన.. పార్టీ కోసం ఎంతో శ్రమించా.. 33 ఏళ్లగా పార్టీలో ఉన్నానని గుర్తుచేసుకున్నారు.. కాగా, ఆలపాటి రాజా ప్రస్తుతం తెనాలి టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.. అయితే, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గతంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.. టీడీపీ-జనసేన పొత్తుపై చర్చ సాగుతోన్న సమయంలో.. ఆ సీటు ఎవరికైనా కేటాయించొచ్చు అనే ప్రచారం సాగుతోన్న వేళ.. ఆలపాటి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.