ఏపీలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ క్రాప్ నమోదు పేరుతో జగన్ సర్కారు రైతులను దారుణంగా దోచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది రైతులను దోచుకుంటున్న ప్రభుత్వం అని.. అన్నదాతల ఆగ్రహానికి సీఎం జగన్ బలికాక తప్పదని ఆలపాటి రాజా హెచ్చరించారు. భూమి, పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 శాతం భూమికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టం చేశారు.
క్వింటాల్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూలీ ఛార్జీలు, గన్నీ బ్యాగ్, రవాణా ఛార్జీల పేరుతో రూ.400 వరకు రైతుల నుంచి అధికారులు వసూలు చేస్తున్నారని ఆలపాటి రాజా ఆరోపించారు. 6, 7 నెలలు గడిచినా ధాన్యం బకాయిలు చెల్లించడం లేదన్నారు. అధికార పార్టీ ఎంపీనే ధాన్యం రైతుల దోపిడీ వివరాలు బయట పెట్టారని.. ఇంతకంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు ఉండదన్నారు. సీఎం చెబుతున్న రైతు భరోసా కేంద్రాలు పేరు గొప్ప, ఊరు దిబ్బగా మారాయని ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీ రుణాలు రాష్ట్రంలో ఎందరు రైతులకు ఇచ్చారో సీఎం జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ ఏనాడైనా పంట సీజన్‌లకు ముందు జలవనరులు, వ్యవసాయ శాఖలతో సమీక్ష చేశారా అని ఆలపాటి రాజా నిలదీశారు.