ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులతో పోటీ పడేందుకు వీలుగా ఇకపై ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ప్రభావం, చలి కాలం కారణంగా ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రద్దీని బట్టి ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు.
Read Also: ఏపీలో కొత్త లెక్కలు… ఇకపై జనాభాలో కర్నూలు జిల్లానే టాప్
ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాలలో మంగళవారం నుంచే అధికారులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే కొన్ని ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించారు. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండే పలు రూట్లలో ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. వీకెండ్, పీక్ అవర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలే ఉంటాయని… మిగిలిన రోజులు, రద్దీ తక్కువ ఉండే సమయాల్లో ఛార్జీలు తక్కువ ఉంటాయని అధికారులు తెలిపారు.