పెగాసస్ వివాదంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అస్త్రంగా వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు అసెంబ్లీలో పెగాసస్ వివాదంపై చర్చ కూడా చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు.
జీవితాంతం దుష్టుల నుంచి తాను ప్రజలను రక్షిస్తే.. ఇప్పుడు తనకే రక్షణ లేకుండా పోయిందని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని.. కానీ ఉద్యోగం చేసే వారికీ కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు. ప్రభుత్వాన్ని తాను విమర్శించకూడదని.. తాను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని.. ప్రైవేట్ వ్యక్తులు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
తానేం నాగాలాండ్ నుంచి రాలేదని.. పంజాబ్ నుంచి రాలేదని.. ఏపీ మట్టిలోనే పుట్టానని తెలిపారు. తప్పు చేయాలంటే తాను భయపడే వ్యక్తిని అని.. పెగాసస్ లాంటి వివాదంలోకి తనను లాగుతారని తెలిస్తే సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చేవాడిని కాదన్నారు. ఇలా జరిగితే మరేవరైనా వస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నంత వరకు పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనలేదని.. ఇది ఫైనల్ అని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
మరోవైపు తనపై జరుగుతున్న విచారణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తన సస్పెన్షన్ విషయం కోర్టు వద్ద పెండింగులో ఉందన్నారు. తనను సస్పెండ్ చేసిన నాటి నుంచి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని.. ఇది ఎంత వరకు సమంజసమని నిలదీశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేయడానికి ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరినట్లు పేర్కొన్నారు. ఆరు పేజీల అబద్దాలను సీపీఆర్వో మీడియాకు విడుదల చేశారని.. ఆ ఆరు పేజీల్లోని అంశాలు తనపై దాఖలు చేసిన ఛార్జ్ మెమోలో లేవని స్పష్టం చేశారు. రూ.25 కోట్ల కుంభకోణం జరిగిందని బయట ప్రచారం చేశారు కానీ ఛార్జిషీట్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు. తనపై వేసిన మూడు అభియోగాల్లో అవినీతికి సంబంధించిన అంశమే లేదన్నారు. తనను ఏకంగా దేశద్రోహి అని ప్రచారం చేశారని.. ప్రాణాలను అడ్డం పెట్టి విధి నిర్వహిస్తే.. తనది దేశద్రోహమా అన్నారు. ఈ విధంగా అబద్దాలను ప్రచారం చేసి తనను, తన కుటుంబాన్ని రోడ్డున పడేశారన్నారు. పెగాసెస్ విషయంలో ప్రస్తుతం తనపై చేస్తోన్న ఆరోపణల్లోనూ ఎలాంటి వాస్తవం ఉండదన్నారు.