Police: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు.. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై దాడి ఘటనపై స్పందించారు.. గుర్తు తెలియని వ్యక్తి సత్యకుమార్ వాహనంపై రాసి విసిరాడని.. ఆ తర్వాత పొలాల్లోకి పారిపోయాడని వెల్లడించారు.. ఇక, తమపై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మూడు రాజధానుల ఆందోళనకారులు ఫిర్యాదు చేశారని తెలిపిన ఆయన.. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.
Read Also: ED raids in Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం..
కాగా, మందడం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ఉద్యమం 12 వందల రోజులకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు బీజేపీ నేత సత్యకుమార్ మద్దతు తెలిపారు. తిరిగి వెళ్తున్న సమయంలో మూడు రాజధానుల శిబిరం వద్ద సత్యకుమార్ వాహనాన్ని అల్లరి మూకలు అడ్డుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.. ఈ క్రమంలో సత్యకుమార్ వాహనంపై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నాయి.. ఈ రోజు ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.. ఇక, ఈ ఘటనపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీరియస్‌గా స్పందించారు.. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు.. తమ కార్లపై పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేశారని.. మా కార్యకర్తలను వెంటబడి కొట్టారని అన్నారు..