మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. 96 శైవ క్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి 3,225 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా కోటప్ప కొండకు పలు ప్రాంతాల నుంచి 410 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంకు పలు ప్రాంతాల నుంచి 390 బస్సులు, కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బలివె, పట్టిసీమ తదితర శైవ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి చార్జీల పెంపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డు పై వెళ్లేందుకు ఫిట్ నెస్ కల్గిన బస్సులు, తర్ఫీదు పొందిన డ్రైవర్లు ఏర్పాటు చేశామన్నారు. బస్టాండ్లలో తాగునీరు సహా మౌలిక వసతులు, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను శానిటైజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు అదనపు బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమూహంగా వెళ్లే భక్తులు ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదిస్తే బస్సులు ఏర్పాటు చేస్తారన్నారు.