విజయవాడలోని అశోక్‌నగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది..
కృష్ణాజిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్బాస్.. క్రేన్ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. విజయవాడ అశోక్‌నగర్‌కు చెందిన మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా అనే (18 నెలల) చిన్నారులు ఉన్నారు. ఈనెల 19న అబ్బాస్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో మచిలీపట్నం నుంచి విజయవాడ అశోక్‌నగర్‌లోని అత్తారింటికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆఫియా ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్లింది. అక్కడ బాత్రూం శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ కనిపించింది. సీసా మూత తీసి మంచినీళ్లు అనుకుని తాగేసింది. అనంతరం చిన్నారికి వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. తండ్రి అబ్బాస్ వెంటనే గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. వైద్యులు వెంటనే వైద్యం ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న గ్యారెంటీ లేదు..!