విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గల కారణాలను పోలీసులు తెలిపారు. పక్కా స్కెచ్‌తోనే ప్రభాకర్ గ్యాంగ్ హత్య చేసిందని విజయవాడ డీసీపీ జాషువా మీడియాకు వెల్లడించారు. ఆకాష్ మర్డర్ కేసులో 11 మందిని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వాంబే కాలనీలో రౌడీషీటర్ టోని అనే వ్యక్తి ఇటీవల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టోని అంత్యక్రియల సమయంలో ఆకాష్, ప్రభాకర్ గ్యాంగ్‌ల మధ్య వివాదం చోటుచేసుకుంది.
టోని అంత్యక్రియల అనంతరం వీరంతా ఓ బార్‌లో ఫూటుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే టోని గ్యాంగ్‌లోని ప్రభాకర్ బ్యాచ్, ఆకాష్ గ్యాంగ్ మధ్య వివాదం చెలరేగింది. అయితే, గొడవ పెద్దది కావడంతో పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారని తెలియడంతో రెండు గ్యాంగులు బార్ నుంచి వెళ్లిపోయాయి.
అయితే, ఈ పగను మనసులో పెట్టుకున్న ప్రభాకర్ గ్యాంగ్ ఈ నెల 1వ తేదీన రాత్రి.. ఆకాష్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి అతడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. కత్తులతో దాడి చేయడంతో కత్తి గొంతులోకి బలంగా దిగడంతో ఆకాష్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. గతంలో ప్రభాకర్‌పై ఒక కేసు ఉండగా.. ఆకాష్‌పై 4కేసులు ఉన్నాయని డీసీపీ చెప్పారు. ఆకాష్, ప్రభాకర్‌లకు మధ్య గతంలో ఓ అమ్మాయి వ్యవహారంలో కూడా గొడవ జరిగిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకే చోట ఎదురు పడడంతో గొడవ మొదలైందన్నారు. ఆకాష్ హత్యకు ముందే కుట్ర పన్ని ప్రభాకర్, అతని స్నేహితులు కత్తులతో వచ్చారని పేర్కొన్నారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆకాష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఐదుగురు ఎస్సైలతో బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించామని.. వారిపై రౌడీషీట్‌లు పెడతామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీసీపీ జాషువా వెల్లడించారు.